సైకిల్ స్టాండ్ పేరిట అక్రమ వసూళ్లు
భక్తులను వేధించిన వ్యక్తులపై కేసు నమోదు
విచారణ తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసుల స్పష్టీకరణ
కాకతీయ, గీసుగొండ: జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మాల గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సీఐ డి విశ్వేశ్వర్ వివరాలు వెల్లడించారు. లక్ష్మీనరసింహ స్వామి జాతర సందర్భంగా సైకిల్ స్టాండ్ టెండర్ దేవులపల్లి అశోక్‌కు కేటాయించగా నిర్దిష్ట గడువు వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యింది. గడువు ముగిసిన తర్వాత కూడా కొంతమంది కలిసి భక్తుల వాహనాలను అడ్డగించి సైకిల్, కార్ పార్కింగ్ పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందింది. గ్రామపంచాయతీ కార్యదర్శి రేమల్లి శంకర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


