అల్లుడే హంతకుడు ?
సుత్తితో తలపై కొట్టి.. ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి..
భార్య, మామను కిరాతకంగా చంపినట్లు అనుమానం !
కుటుంబ కలహాలే కారణం?
రాజీవ్ గృహకల్పలో తండ్రి, కుమార్తె సజీవ దహనం
మంటల్లో సజీవ దహనమైన తండ్రి రాజశేఖర్, కుమార్తె రాజశ్రీ
హనుమకొండ జిల్లా కడిపికొండలో దారుణం
కాకతీయ, హన్మకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో దారుణం చోటు చేసుకుంది. తండ్రీ కుమార్తెలు సజీవ దహనమయ్యారు. అల్లుడు ప్రవీణ్ కుటుంబ కలహాలతో ఇద్దరినీ సజీవదహనం చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కడిపికొండ రాజీవ్ గృహకల్పలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. భాషబోయిన రాజశేఖర్ (54) అతని కుమార్తె రాజశ్రీ (24) మంటల్లో కాలిపోతుంటే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న భాషబోయిన రాజశేఖర్‌కు ముగ్గురు కుమార్తెలు కాగా రాజశ్రీ పెద్దమ్మాయి. అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప ఉన్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలతో వచ్చి తండ్రితో పాటే హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని రాజీవ్‌గృహకల్పలో బ‌్లాక్ 5లో ఉంటోంది. కుటుంబ తగాదాలు, భార్యతో గొడవలు జరుగుతున్నాయని సమాచారం. ఈ తరుణంలో రాజశేఖర్, రాజశ్రీ (24) సజీవ దహనమయ్యారు.
పొంతనలేని సమాధానాలు
భార్యతో గొడవలు తదితర కారణాలతో అల్లుడు ప్రవీణే భార్య, మామను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుత్తితో తలమీద కొట్టి ఇద్దరిపై డీజిల్ పోసి తగలుబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశాడని అనుమానిస్తున్నారు. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అనాథలైన పిల్లలు
నిన్నటివరకూ బాగానే ఉన్న తండ్రీ కుమార్తెలు ఇద్దరూ మంటల్లో కాలిపోయి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాజశ్రీ చనిపోవడంతో రెండేళ్లు బాబు, ఆరు నెలల పాప అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు తొలుత ప్రచారం
పోలీసుల ప్రాథమిక అంచనాల ప్రకారం గదిలో ఉన్న ఏసీ యంత్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు తొలుత భావించారు. విద్యుత్ సంబంధిత లోపాల వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానించారు. ఇంట్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు తప్పించుకునే అవకాశం లేకపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నదానిపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. విద్యుత్ లోపం కారణమా, లేక ఇతర కారణాలున్నాయా అన్నదానిపై స్పష్టత రానుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


