‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా
‘కొత్త సినిమాటిక్ యుగానికి నాంది’
ఆదిత్య ధర్‌పై రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం
వర్మ రివ్యూతో ‘ధురంధర్’ హైప్ శిఖరానికి
కాకతీయ, సినిమా : బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం విడుదలకు ముందే హైప్ పీక్స్‌కు చేరింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈరోజు నుంచే పేడ్ ప్రీవ్యూలు ప్రారంభమయ్యాయి. సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ‘షోలే x 100 స్థాయి’గా అభివర్ణిస్తూ, పాత క్లాసిక్స్ అన్నీ టీవీ సీరియల్స్‌లా కనిపించేలా చేస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం సినిమా కాదని, ఇండియన్ సినిమా ప్రపంచంలో కొత్త సినిమాటిక్ ఆర్డర్‌కు నాంది అని వ్యాఖ్యానించారు. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌పై వర్మ ప్రత్యేకంగా స్పందించారు. ఇకపై ‘డైరెక్టర్’ అనే పదానికి అర్థమే మారిపోతుందని, ఆ పదం ఆదిత్య ధర్ పేరుతోనే మొదలవుతుందని కితాబిచ్చారు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని సూచించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్రానికి ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముందస్తు వసూళ్లు 150 కోట్ల మార్క్ దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. 229 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తర్వాత నిజంగా వర్మ చెప్పిన స్థాయిలో మెప్పిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.


