ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు
ఉగాది రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఐదు వారాల తర్వాతే ఓటీటీకి రానున్న చిత్రం
కాకతీయ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ సమావేశంలో నిర్మాత నవీన్ యెర్నేని సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 24, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె ఎస్ రవికుమార్, గౌతమి, పార్తీబన్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా థమన్ నేపథ్య సంగీతంతో సినిమాను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.


