ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోండి
కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జిల్లా ఆసుపత్రి తనిఖీ.. సిబ్బందికి ప్రశంసలు
కాకతీయ, పెద్దపల్లి : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు విభాగాల పనితీరును పరిశీలించారు.మాతా-శిశు సేవలు, రేడియాలజీ, గైనకాలజీ, లేబర్ రూమ్, ఆప్తామాలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మసీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలకు ఈడీడీ క్యాలెండర్ ఆధారంగా ముందస్తుగా గుర్తించి, హెల్ప్‌డెస్క్ ద్వారా సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వైద్య సిబ్బంది సూపరింటెండెంట్ అనుమతి లేకుండా సెలవులకు వెళ్లరాదని స్పష్టం చేశారు. యూఎస్‌జీ, టిఫా స్కానింగ్, ఓపీ సేవలపై వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. లేబర్ రూమ్‌లో శుభ్రత పాటించాలని సూచించారు. మాతా-శిశు వార్డుల్లో రోగులతో మాట్లాడి మందుల సరఫరా, నర్సింగ్ సిబ్బంది సేవలపై ఆరా తీశారు. రోగుల నుంచి వచ్చిన స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆప్తామాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫాకో పరికరం పనితీరును పరిశీలించి, ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. నెలకు 60–70 వరకు ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫార్మసీ స్టాక్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, వేయిటింగ్ హాల్‌లో సీటింగ్ సామర్థ్యం పెంచాలని, రోగుల కోసం అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆర్ఎంఓకు సూచించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ విజయకుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ సాయి ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


