కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేడు సభలో పెట్టిన బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాష్ట్రంలో బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివ్రుత్తి చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై సభలో చర్చ జరగాల్సిందే అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయ్యింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీలు అంతా ఆశపడ్డారన్నారు.
మంత్రివర్గంలో బీసీల సంఖ్య ఎంత ఉందని ప్రశ్నించారు. బీసీల్లో సమర్థులు లేరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం గుండెపై చేయివేసుకుని చెప్పాలన్నారు. మంత్రివర్గంలో మీరు ఇచ్చిన కార్పొరేషన్లలో బీసీల సంఖ్య ఎంత..ఏడాదికి రూ. 20వేల కోట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటన చేసింది. ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అయ్యింది. ఆ లెక్కన రూ. 40 వేల కోట్లు బీసీలకు రావాల్సి ఉందన్నారు. చట్టాలు చేసే ముందు న్యాయాస్థానాలవైపు కూడా చూడాలని..ఎలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేకుండా చట్టాలు చేయాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వద్దని మేము ఎక్కడా చెప్పలేదని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.


