దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే
* డ్రగ్స్ తో భవిష్యత్తు నాశనం
* విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకోవాలి
* విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
* ఎస్ఐ జీ.అపూర్వ రెడ్డి
కాకతీయ, చేర్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని ఆకునూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎస్ఐ జీ. అపూర్వ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలనా ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం ఆకునూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్, ట్రాఫిక్ రూల్స్,సైబర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అపూర్వ రెడ్డి మాట్లాడుతూ. విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్, ట్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆదిశగా పయనించాలని ఆన్నారు.దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారేనని తెలిపారు.
డ్రగ్స్ తో భవిష్యత్తు నాశనం
డ్రగ్స్ వ్యసనంగా మారితే భవిష్యత్తు నాశనమవుతుందని, యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ వల్ల చదువు, కెరీర్ దెబ్బతింటుందని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలు వస్తాయన్నారు. మత్తుపదార్థాల ప్రభావంతో యువత తప్పుడు మార్గాల్లో వెళ్లి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తనలో మార్పును గమనించి సలహాలు ఇవ్వాలని కోరారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై విద్యార్థులు కలిగి ఉండాలని రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డి అన్నారు. మొబైల్ ద్వారానే 80 శాతం సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై నేరాలు ఎక్కువయ్యాయన్నారు. విశృంకల పాశావికమైన ఆలోచనల విధానాల వలన ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయని, వీటి కట్టడికి చట్టాల ద్వారానే కాక మానవుల మనస్సుల్లో మార్పు రావాలన్నారు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఓటీపీలు చెప్పరాదన్నారు. బాలికలపై అత్యాచారాలకు పాల్పడటం, బాల్య వివాహాల చేయడం, వారిని ప్రొత్సహించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అపూర్వ రెడ్డి స్పష్టం చేశారు.
.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


