ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ
లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాడెండ్‌గా పట్టివేత
భూమి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్
పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు
కాకతీయ, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. భూమి మ్యూటేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసి చివరకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దేముల్ మండలం ఇందుర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బావమరిది భూమికి సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియ కోసం ఆర్ఐను సంప్రదించాడు. భూమి మార్పిడి, క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ఇవ్వడానికి ఆర్ఐ రిచర్డ్ సైమన్ మొదట ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తర్వాత చర్చల తర్వాత పదిహేను వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రూపొందించారు.
హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి ఆర్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ఐపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆర్ఐ పట్టుబడిన వెంటనే పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.


