పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు
టెన్త్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
మౌలిక సదుపాయాలపై సత్యశారద ఆరా
కాకతీయ, నర్సంపేట: పదో తరగతి పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట జెడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న కనీస మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైద్య శిబిరంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్లతో ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దని స్పష్టం చేశారు. పరీక్షా విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిని కూడా తనిఖీలు చేసిన తర్వాతే అనుమతించాలని డిఇఓ, చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ తదితరులు ఉన్నారు.


