కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై తమ ప్రభుత్వం నిజాయితీగా కృషి చేస్తోందని అన్నారు. అయితే ఈ ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలుస్తోందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గతంలోనే తమ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపిందని గుర్తు చేశారు. అయితే గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని, అప్పటి నుంచి ఆ బిల్లులు అక్కడే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు.
అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018, 2019లో చేసిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల వల్లే రిజర్వేషన్ల అమలు కష్టంగా మారిందని సీఎం విమర్శించారు. ఈ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా, గవర్నర్ మళ్లీ ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతికి పంపారని ఆయన తెలిపారు.
ఈ సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించామని, కానీ బీఆర్ఎస్ ఎంపీలు సహకరించలేదని రేవంత్ ఆరోపించారు. బీసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పుకునే గంగుల కమలాకర్ కూడా ఆ సమయంలో రాలేదని ఆయన విమర్శించారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం బీఆర్ఎస్ నాయకత్వానికి అస్సలు ఇష్టం లేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం కూడా అసెంబ్లీలో బిల్లులను ఆమోదించకుండా బీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని సీఎం ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని రేవంత్ స్పష్టం చేశారు. చివరగా, సహకరించని బీఆర్ఎస్‌కు భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.


