వచ్చారు వెళ్లారు !
తూతూమంత్రంగా నీటి పారుదలశాఖ డీఈ తనిఖీలు
అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నా, చర్యలు తీసుకోవడంలో జాప్యం
సార్ వచ్చే సరికి జేసీబీగానీ, ట్రాక్టర్‌గానీ కనిపించకపోవడం గమనార్హం
సమిష్టి దాడులు చేయాలని ప్రజల డిమాండ్
కాకతీయ, రాయపర్తి : మండలంలోని ఎస్సారెస్పీ స్టేజ్-2 కాకతీయ కాలువ గట్ల వెంబడి సాగుతున్న అక్రమ తవ్వకాలపై మంగళవారం “మట్టి దొంగలు” అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్త జిల్లా యంత్రాంగంలో కదలిక తెచ్చింది. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించడంతో డివిజనల్ ఇంజనీర్ కిరణ్ కుమార్ అదే రోజు మధ్యాహ్నం ఏఈఈలు అమర్, తిరుపతితో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. కానీ అధికారులు అనుసరిస్తున్న తీరు “వేడినీళ్లకు చన్నీళ్లు” తోడైనట్లుగా ఉంది. పత్రికల్లో వార్తలు రావడంతో హడావిడిగా రంగంలోకి దిగిన నీటిపారుదలశాఖ డీఈ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. ఆయన “ఇలా వచ్చి చూసి అలా వెళ్లారే తప్ప, అక్రమ తవ్వకాలను అరికట్టడం, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం గమనార్హం. స్వయంగా కాలువ గట్లను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినా ఇప్పటి వరకు ఒక్క వాహనాన్ని కూడా సీజ్ చేయకపోవడం, ఎవరిపైనా పోలీస్ కేసు నమోదు చేయకపోవడం వెనుక మర్మమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ తనిఖీలు కేవలం పత్రికా వార్తలకు సమాధానం చెప్పుకోవడానికే తప్ప, అక్రమార్కుల్లో వణుకు పుట్టించేలా లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. విచిత్రమేమిటంటే.. డీఈ వస్తున్నారనే సమాచారం అక్రమార్కులకు ముందే చేరిందో ఏమో కానీ, ఆయన వెళ్లేసరికి అక్కడ ఒక్క జేసీబీ గానీ, ట్రాక్టర్ గానీ కనిపించకపోవడం గమనార్హం. అక్రమ తవ్వకాలు కళ్లముందే కనిపిస్తున్నా, చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడం వెనుక అంతర్యమేమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సమిష్టి దాడులు..
మట్టి దొంగలకు వణుకు పుట్టేలా తక్షణమే అన్ని ప్రధాన శాఖలు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడం మానేసి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు కలిసి రంగంలోకి దిగాలని, సమిష్టి దాడులు చేయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఒక్కరే వచ్చామా చూసామ వెళ్ళామా అంటూ చేసిన తనిఖీ వల్ల ఒరిగిందేమిటనే విమర్శలు వెళువెత్తుతున్నాయి. డీఈ కిరణ్ కుమార్ తనిఖీ కేవలం ఒక ప్రహసనంలా సాగిందని రైతులు మండిపడుతున్నారు. తవ్వకాలు జరిగిన చోట గుంతలను చూసి కూడా, ఇప్పటి వరకు ఒక్క ట్రాక్టర్, జేసీబీని కూడా పట్టుకోకపోవడం అధికారుల చిత్తశుద్ధిని శంకిస్తోంది. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని మండల స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి సమిష్టి దాడులకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు.


