ఆదివాసిలకు కాంగ్రెస్‌లో పెద్దపీట
వారి హక్కుల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
సామాజిక న్యాయం అమలులో తెలంగాణ ముందుంది
ఎస్టీ నేతలకు కాంగ్రెస్‌లో కీలక పదవులు ఇవ్వనున్నాం
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ఇందిరా భవన్‌లో ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
కాకతీయ, గాంధీ భవన్ : ఇందిరా భవన్‌లో నిర్వహించిన తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ ఎమ్మెల్యే విక్రాంత్ బూర్య, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో పాటు ఆదివాసి ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి డీసీసీ నియామకాలలో పెద్దపీట వేశామని తెలిపారు. అందులో భాగంగా ఎస్టీ వర్గానికి చెందిన ఐదుగురు నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామని చెప్పారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజార్టీగా డైరెక్టర్ పదవులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ హక్కులు మరియు భూమి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లంబాడీలు ఎక్కువగా ఉన్న తన స్వగ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం పదకొండు ఎకరాల భూమిని ఇచ్చానని తెలిపారు. చదువుకుంటే జీవితం రంగులమయం అవుతుందని, ఆదివాసి యువత విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు పెద్ద సంఖ్యలో గెలిచారని అన్నారు. దేశ ప్రజల సంరక్షణ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసిన మహనీయురాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. సమావేశానికి ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ బూర్య, ఆల్ ఇండియా ఆదివాసి కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క, ఆదివాసి ఎంపీలు, ఎమ్మెల్యేలు,తదితరులు హాజరయ్యారు.


