ఫిరాయింపును కాదనడం ఆశ్చర్యకరం
స్పీకర్ తీర్పు.. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం
రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం రాష్ట్ర ప్రజలందరూ చూసిన విషయమని అన్నారు. ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడం, అదే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం వంటి స్పష్టమైన రికార్డులు ఉన్నప్పటికీ కూడా ఇది పార్టీ ఫిరాయింపు కాదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించే తీర్పని రాంచందర్ రావు అన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టేనని విమర్శించారు. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. కాబట్టి ఈ అంశంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో అదే యాంటీ డిఫెక్షన్ చట్టం స్పష్టంగా ఉల్లంఘనకు గురవుతున్న పరిస్థితుల్లో స్పీకర్ ఇలాంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినట్టేనని ఆయన అన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ మరోవైపు పార్టీ నాయకుల చర్యలను సమర్థించే పరిస్థితి ఎందుకు వస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని మరియు ప్రజల తీర్పును కూడా అవమానించిందని పేర్కొంటూ బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు


