నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి
యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా మందుల స్వాధీనం
అర్హతలేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తిపై కేసు
వెలుగులోకి భూపాలపల్లి జిల్లాలోని నకిలీ క్లినిక్ బాగోతం
కాకతీయ, వరంగల్ బ్యూరో : జిల్లాలో నకిలీ వైద్యులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌పై అధికారులు ఆకస్మిక దాడి చేసి భారీగా మందులను స్వాధీనం చేసుకున్నారు. అర్హతలు లేకుండానే వైద్యం చేస్తూ ప్రజలకు మందులు అందిస్తున్నట్లు గుర్తించడంతో కేసు నమోదు చేశారు. గ్రామంలో అర్హతలు లేని వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నాడనే ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు క్లినిక్‌పై ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ వివిధ రకాల మందులను నిల్వ ఉంచి రోగులకు అందిస్తున్నట్లు గుర్తించారు. దాడి సమయంలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మందులు సహా సుమారు 50 రకాల ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుల విలువ సుమారు 45,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా మందులను నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. వైద్య అర్హతలు లేకుండానే చికిత్స అందించడం, నియంత్రిత మందులను విక్రయించడం వంటి అంశాలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలకు హెచ్చరిక
అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను ఇవ్వడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. ఇటువంటి మందులను తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు వైద్యం చేస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నకిలీ క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇలాంటి ఘటనలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలిపారు.


