ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?
రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ
పోస్టర్లు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
అధికారుల అనుమతులపై స్పష్టత లేక అనుమానాలు
కాకతీయ, జమ్మికుంట: ఇల్లందకుంట మండల కేంద్రంలో “మా అవసరం – మీ అదృష్టం” అనే పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రూ.3500 టికెట్‌తో 90 లక్షల ఇల్లు, లక్షల రూపాయల బహుమతులు ఇస్తామని పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. 327 గజలలో రెండు అంతస్తుల భవనం కోసం 2500 టోకెన్స్ మొత్తం అమ్ముుుతున్నట్లు నిర్వాకులు పోస్టర్ తయారు చేశారు. రూ.3500 చెల్లిస్తే మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేల చొప్పున బహుమతులు ఇస్తామని ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయితే ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.
*అనుమతులపై స్పష్టత లేదు
ఇలాంటి లక్కీ డ్రాలు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా..? సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ ఉందా..? అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.సాధారణంగా లాటరీలు లేదా బహుమతి పథకాలు నిర్వహించాలంటే సంబంధిత అధికారుల అనుమతి అవసరం. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ప్రాంతాల్లో లక్కీ డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు సేకరించి తర్వాత నిర్వాహకులు అదృశ్యమైన ఘటనలు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి ప్రకటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. సరైన అనుమతులు లేకుండా నిర్వహించే లక్కీ డ్రాల్లో పాల్గొంటే నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
*చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి
ఇల్లందకుంట మండలం తో పాటు ఇతర మండలాలలో వాట్సప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో వైరల్ గా ఈ పోస్టర్ పంపిస్తున్నప్పటికీ వివిధ గ్రామాల వాట్సాప్ గ్రూపులో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ దీనిపై పోలీసు అధికారుల నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాకపోవడం గమనార్హం.. ఆన్లైన్ మోసాలు సైబర్ క్రైమ్ ద్వారా లక్షల రూపాయలు ప్రజలు నష్టపోతుంటే కొత్తగా ఈ ప్రాంతంలో ఇలాంటి లక్కీ డ్రా లు నిర్వహిస్తుండడంతో 3500 కి 90 లక్షల ఇల్లు వస్తుందేమో పోతే తక్కువ అమౌంట్ పోతుందని ఆశతో మరి కొంతమంది లక్కీ డ్రా కూపన్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.ప్రజలు డబ్బులు కట్టి మోసపోక ముందే దీనిపై సంబంధిత నిర్వాహకుల తో విచారణ జరిపి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనేది తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు.


