వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి బీఎంఎస్ వినతి
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని మేయర్‌కు విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నాయకులు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రహదారులు, మున్సిపల్ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో కూరగాయలు, చిరు సామాగ్రి విక్రయిస్తూ అనేక మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. అయితే తరచూ మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు తమ సామాగ్రిని జప్తు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి వ్యాపారులకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
కలెక్టర్ బంగ్లా ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా వీధి వ్యాపారులకు శాశ్వత వేదిక లభిస్తుందని పేర్కొన్నారు.అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) సిబ్బంది వీధి వ్యాపారులను వేధిస్తూ సామాగ్రిని జప్తు చేస్తున్నారని, వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించడం మానుకోవాలని కోరారు. మార్కెట్ అందుబాటులోకి వచ్చే వరకు వీధి వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు పసుల శ్రవణ్, జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్, స్ట్రీట్ వెండార్స్ నాయకులు ఆకుల తిరుపతి, నక్క అరుణ్, రమణయ్య, శ్రీనివాస్, మంజూల తదితరులు పాల్గొన్నారు.


