జాబ్ మేళాకు విశేష స్పందన
కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం తెలిపారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ ఫైనాన్స్, టెక్ మహీంద్ర, క్వాంటం హెచ్‌ఆర్‌ఎం సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్, మెరీనా పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయాలుకాస్, మ్యాజిక్ బస్ టాస్క్ సంస్థలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కళాశాల విద్యార్థినులతో పాటు ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. కళాశాల ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ సి.హెచ్. శోభారాణి మాట్లాడుతూ… మొత్తం సుమారు 160 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 100 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరిలో 80 మంది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కాగా, మరో 20 మంది ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం మాట్లాడుతూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఇటువంటి జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్థలను ఆహ్వానించి విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కమలా క్రిస్టియాన, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎంఎం లక్ష్మి, అధ్యాపకులు, వివిధ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


