కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
కేంద్రమంత్రులకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
పెండింగ్ ప్రాజెక్టులపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని విజ్ఞప్తి
కాకతీయ, హైదరాబాద్ : కేంద్ర మంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని ఆయన లేఖలో విమర్శించారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పొన్నం ప్రభాకర్ కోరారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయగా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఉన్న హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టుల అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లను కోరారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను విస్మరించడం సరికాదని పేర్కొన్న మంత్రి, కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర వాటాను మళ్లీ 90 శాతానికి పెంచాలని కూడా తన లేఖలో డిమాండ్ చేశారు.


