విద్యుత్ తీగలు తాకి రైతు మృతి
మృతదేహంతో ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన
ఇంటికి తాళం వేసి పరారైన రైతు
రెడ్డిపాలెం వద్ద ఉద్రిక్త పరిస్థితి
కాకతీయ, గీసుగొండ: అడవి పందుల నుండి పంటను రక్షించుకునేందుకు పొలానికి అమర్చిన విద్యుత్ తీగలు తగిలి పక్క రైతు మృతి చెందిన ఘటన మొగిలిచర్లలో విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ పరిధిలోని బండారు కొమురయ్య కొత్తపేట రెవెన్యూ గ్రామంలో ఉన్న తన మొక్కజొన్న పంటను అడవి పందుల నుండి కాపాడుకునేందుకు పొలానికి విద్యుత్ తీగలు అమర్చాడు. అదే సమయంలో మొగిలిచర్ల గ్రామానికి చెందిన గాద శ్రీను తన పంట పొలానికి వెళ్లే క్రమంలో కొమురయ్య ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శ్రీను మృతదేహాన్ని తీసుకుని రెడ్డిపాలెంలో ఉన్న కొమురయ్య ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అయితే ఘటన తెలిసిన వెంటనే కొమురయ్య తన ఇంటికి తాళం వేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీను మృతదేహంతో మొగిలిచర్ల సర్కిల్‌లోని రుద్రమదేవి విగ్రహం వద్ద కూడా ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న ఎనుమాముల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


