కాకతీయ, వరంగల్ : దేశం అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని అకారణంగా దూషించడమే కాక ఆయన తల్లిపై కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ధ్వజమెత్తారు. వరంగల్ చౌరస్తాలో శనివారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ద్వేషపూరిత పార్టీ అని, దానికి విలువలంటూ లేవని, విద్వేషాలను రెచ్చగొట్టడమే ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమాల్లో ఆ పార్టీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం, దానిని రాహుల్ గాంధీ వాటిని ఖండించకపోవడం ఆయన విష సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. విదేశీ సంస్కృతిలో పుట్టి పెరిగిన రాహుల్ గాంధీకి తల్లి విలువ ఏం తెలుసు అని ప్రశ్నించారు.
ఓట్ల రాజకీయాల కోసం కన్నతల్లిని రాజకీయాల్లోకి లాగి విషపు ఆనందాన్ని రాహుల్ గాంధీ పొందుతున్నారని ఘాటుగా విమర్శించారు. జరిగిన దానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోదీ ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని ఓ ఆదర్శవంతమైన తల్లిని ఇలా తన స్వార్థం కోసం వాడుకునే రాహుల్ గాంధీ దిగజారుడుతనాన్ని దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారని రవికుమార్ వెల్లడించారు. దేశ ప్రధాని అవుతానని కలలు కంటున్న రాహుల్ కు రానున్న రోజుల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారుతోందని విమర్శించారు. కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం కచ్చితంగా చెబుతారని, బిజెపి ప్రభుత్వం అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని గంట అన్నారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కాసు శిల్పా, మహిళా మోర్చా నాయకురాలు పిట్టల సరస్వతి, మార్త ఉషారాణి, స్వర్ణ, రాజేశ్వరి, ఉమాదేవి, స్వరూప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, ఫైర్తా ఆనంద్, జిల్లా కోశాధికారి కూచన క్రాంతి, ప్రచార కార్యదర్శి బైరి శ్యాంసుదర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బైరి నాగరాజు, సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్, జిల్లా విశ్వకర్మ సెల్ కన్వీనర్ శ్రీరామోజు మోహన చారి, కార్యాలయ కార్యదర్శి పెద్ది నవీన్, మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, అపురూప రజనీష్, బోరిగం నాగరాజు, బిజెపి నాయకులు కర్నే రవీందర్, అంకాల జనార్ధన్, వైట్ల గణేష్, మామిడాల సతీష్, అల్లి అజయ్, జెట్లింగ్ శివ, గోల రాజకుమార్ మడిపల్లి నాగరాజు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


