ఇక ఉపేక్షించేది లేదు
కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియస్
పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు
అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి
ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత అధికారులదే
ఆహార భద్రత కమిటీలు ముందుగా రుచి చూసి వడ్డించాలి
నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలోని విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రాహుల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు, ఆర్‌సీవోలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత ఆర్‌సీవోలు, మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులదేనని స్పష్టం చేశారు. కలుషిత ఆహార ఘటనలపై కేవలం వంటవారు లేదా వార్డెన్లపై చర్యలు తీసుకోవడం సరిపోదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల మణుగూరులోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు విద్యార్థినులు ఇంటి నుంచి తీసుకువచ్చిన బిర్యానీ, మాంసాహార పదార్థాలు తీసుకోవడంతో అస్వస్థతకు గురైనట్లు వెల్లడైంది. పాఠశాలలు, వసతి గృహాల్లో ఆహార భద్రత కమిటీ సభ్యులు ముందుగా వండిన ఆహారాన్ని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పోషకాహారం అందేలా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలు, వసతి గృహాలను తరచూ సందర్శిస్తూ ఆహార నాణ్యత, వంటశాల నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.


