బాలల భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై అవగాహన…
కాకతీయ, గీసుగొండ: బాలల భద్రత,మాదక ద్రవ్యాల వ్యతిరేకతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్‌లోని రెడ్డిపాలెం గ్రామంలోని విద్యానిలయ,16వ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్, తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, గీసుగొండ మండల విద్యా అధికారి రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు,వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం,బాలల భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు,సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. కొంతమంది దుర్మార్గులు యువతను మాదక ద్రవ్యాలకు అలవాటు చేయడానికి ప్రయత్నిస్తారని, అలాంటి వారిపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి మంచి భవిష్యత్తు సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ సీఐ విశ్వేశ్వర్,ఎస్ఐ అనిల్ కుమార్,సుమారు 900 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.



