స్టేడియంలో సింథటిక్ ట్రాక్
ఫలించిన మంత్రి తుమ్మల కృషి
రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా పనులు
మరో పది రోజుల్లో అందుబాటులోకి
జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఖమ్మం
క్రీడాకారుల్లో ఆనందం.. ఆశలు పెంపు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం త్వరలో అత్యాధునిక క్రీడా సదుపాయాలతో కొత్త రూపు దాల్చనుంది. జిల్లాలోని క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణ వేదిక అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రూ.8.50 కోట్ల వ్యయంతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా కొనసాగుతుండగా, మరో పది రోజుల్లో ట్రాక్ పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి రానుంది. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ సింథటిక్ ట్రాక్ పూర్తయిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు అనువైన వేదికగా మారనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే.
క్రీడా సదుపాయాల దిశగా తుమ్మల అడుగులు
ఖమ్మం జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని స్టేడియాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు క్రీడాకారులకు అవసరమైన శిక్షణా వేదికలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం వల్ల క్రీడాకారులకు మెరుగైన శిక్షణా అవకాశాలు లభిస్తాయి. ఈ ట్రాక్ మన్నికైన, స్థిరమైన ఉపరితలంతో ఉండటం వల్ల అథ్లెట్లు వేగవంతమైన సమయాలను నమోదు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. గాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా ఈ ట్రాక్‌పై శిక్షణ కొనసాగించవచ్చు. సహజ మట్టి ట్రాక్‌తో పోలిస్తే సింథటిక్ ట్రాక్‌పై సాధన చేసిన అథ్లెట్లు పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మట్టి ట్రాక్‌పై సాధన చేసి సింథటిక్ ట్రాక్‌పై పోటీల్లో పాల్గొన్నప్పుడు సుమారు 1.5 నుంచి 2 సెకన్ల వరకు తేడా రావడం వల్ల పతకాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని వారు పేర్కొంటున్నారు.
క్రీడాకారుల్లో ఆనందం
సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్మిస్తున్న ఈ ట్రాక్ వల్ల ఖమ్మం జిల్లా యువతకు అథ్లెటిక్స్‌లో మరింత ప్రోత్సాహం లభించనుంది. ఇటీవల సీఎం కప్–2024 క్రీడా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ విభాగంలో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 12 బంగారు పతకాలు సాధించడం విశేషం. ఈ విజయాలు జిల్లాలో అథ్లెటిక్స్‌కు ఉన్న ప్రతిభను చాటుతున్నాయి. ఇప్పుడు సింథటిక్ ట్రాక్ అందుబాటులోకి వస్తే జిల్లాలో మరింత మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు పెరుగుతాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఈ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు క్రీడాభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


