ఆగని ఇసుక అక్రమ రవాణా
ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాల్లో తరలింపు
పోలీసులల దాడులు.. నలుగురిపై కేసులు
కాకతీయ, కరీంనగర్ : మానేరు వాగు నుంచి కొత్త పద్ధతిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన భేతి సునీల్ రెడ్డి, బొమ్మకల్ గ్రామానికి చెందిన దుమ్మటి మల్లేశం, బండారి అరవింద్ తమ ట్రాక్టర్లలో మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి కరీంనగర్ వైపు తరలిస్తుండగా బొమ్మకల్ గ్రామంలోని లారీ అసోసియేషన్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న కరీంనగర్ రూరల్ పోలీసులు అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ను ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో వేములవాడకు చెందిన ఎర్రిల్లె సురేష్ తన యజమాని చొప్పరి శివప్రసాద్ ఆదేశాల మేరకు మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వించి జల్లెడ పట్టి సన్నగా చేసి ఎవరికి అనుమానం రాకుండా సంచుల్లో నింపి గూడ్స్ వాహనంలో తరలిస్తున్నట్లు బయటపడింది. ఈ ఘటనలో వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.



