ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి
ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి
అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా పనిచేయాలి
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే పరిపాలన అవసరం
ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్ అంకిత్ ఆదేశాలు
కాకతీయ, కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా అధికారులు వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనలతో కలిసి కలెక్టర్ ప్రజల వినతులను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
పలు వినతులపై ఆదేశాలు
అశ్వాపురం మండలం వేములూరు గ్రామానికి చెందిన కొమరం నాగమణి తనకు ఇంటి స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేదని తెలిపారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తనకు ఇల్లు ఉన్నట్లు చూపించారని పేర్కొంటూ తన పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన సుశీల గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు లబ్ధి అందలేదని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించగా దరఖాస్తు చేసుకోలేదని చూపుతున్నారని చెప్పారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇల్లందు ఎంపీడీవోకు కలెక్టర్ ఆదేశించారు. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన మాదాబత్తుల రమణ ఇంటర్ వరకు చదివి 77 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని తెలిపారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీవనోపాధి కోసం దివ్యాంగుల స్కూటీ మంజూరు చేయాలని కోరారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఎండార్స్ చేశారు. సారపాకకు చెందిన బిటియా ఏసు తన తండ్రి అనారోగ్యంతో 2021లో మరణించారని, అప్పట్లో మరణ ధ్రువీకరణ పత్రం పొందలేకపోయామని తెలిపారు. ఇటీవల దరఖాస్తు చేసుకున్నప్పటికీ సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి దరఖాస్తుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


