పోడు భూముల్లో కందకాలు
మనస్థాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
తిప్పగుట్టలో ఉద్రిక్త పరిస్థితి.. అటవీ శాఖ చర్యలపై రైతుల ఆగ్రహం
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం బోజ్జలగూడెం పంచాయతీ పరిధిలోని తిప్పగుట్టలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు కందకాలు తవ్వడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. రైతు మోహన్ సాగు చేస్తున్న పోడు భూముల్లో అధికారులు కందకాలు తవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో పురుగు మందు డబ్బాను వెంట తీసుకువచ్చి తాగేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తోటి రైతులు వెంటనే అడ్డుకుని మందు డబ్బాను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా రైతు మోహన్ మాట్లాడుతూ తాను భూమినే నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నానని, అకస్మాత్తుగా వచ్చి అధికారులు కందకాలు తవ్వడం వల్ల తాను తీవ్రంగా బాధపడ్డానని వాపోయాడు. ఇప్పటివరకు పోడు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, అధికారులు ఇలాంటి చర్యలు తీసుకుంటే తమ కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో తిప్పగుట్ట ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.


