25 శాతం ఫెనాల్టీ మాఫీ చేయాలి
12 శాతం వడ్డీని రద్దు చేయాలి
ములుగు జిల్లాలో రైస్ మిల్లర్ల ఆందోళన
కలెక్టర్‌కు వినతిపత్రం
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం రైస్ మిల్లర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనను వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను వివరిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు, ప్రభుత్వానికి మధ్య కీలకమైన వారధిగా రైస్ మిల్ పరిశ్రమ పనిచేస్తోందని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, అధిక విద్యుత్ చార్జీలు, గోదాముల కొరత, ధాన్యం నాణ్యత సమస్యలు వంటి అనేక కారణాల వల్ల రైస్ మిల్లర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 2019-20 కరోనా సమయంలో ప్రభుత్వం భారీగా ధాన్యం కేటాయించడంతో చాలా రైస్ మిల్లులు సమయానికి సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని ప్రభుత్వానికి అందించలేకపోయాయని తెలిపారు. హమాలీల కొరత, గోదాముల లేమి కారణంగా ధాన్యం ఎక్కువకాలం నిల్వ ఉండి నాణ్యత దెబ్బతిన్నదని, దీంతో మిల్లర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అప్పట్లో ధాన్యం మద్దతు ధర రూ.1835 ఉండగా ప్రస్తుతం 2025-26 నాటికి అది రూ.2389కు పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో డిఫాల్ట్‌గా గుర్తించబడిన మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం అందించాలంటే అదనంగా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్పారు. దీనికి తోడు ప్రభుత్వం విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ మిల్లర్లపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఒక డిఫాల్ట్ రైస్ మిల్ కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. డిఫాల్ట్ మిల్లర్లపై విధించిన 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించే విధంగా అవకాశం కల్పించాలని అసోసియేషన్ కోరింది.


