గ్యాస్ ధరల పెంపుపై సీపీఎం నిరసన
కాకతీయ, నర్సంపేట టౌన్: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ రోడ్డు కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి, 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచడం మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కానుకేనా అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం మహిళల గురించి గొప్పలు చెప్పుకుంటూ వంట గదికే పరిమితం చేసే విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. యుద్ధాన్ని నెపంగా చూపుతూ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెంచారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు కలకోట అనిల్, ఎండీ ఫరీదా, వజ్జంతీ విజయ, బిట్ర స్వప్న, హన్మకొండ సంజీవ్, లక్క రాజు, రుద్రరపు లక్ష్మి, గణిపాక విలియం కెరీ, బి. లక్ష్మి, ఇటిపాముల వెంకన్న, కందికొండ సంతోష్, దాసరి నరేశ్, జార్జ్ విక్టర్, నర్సింహ రాములు, పైస గణేశ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.


