కాకతీయ, వరంగల్ సిటీ: వృద్ధులు, దివ్యాంగులు ప్రత్యేక ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. శనివారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు.
అర్జీదారులు అందించిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అన్నారు. గత నెల ప్రజావాణి సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, పెండింగ్ దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


