ఆడబిడ్డల ఉసురు తగులుతుంది..!
పరీక్షల సమయంలోనే ఇళ్లు కూల్చడం దారుణం
బాధితుల బాధను రాజకీయ ఎగ్జిబిషన్ చేశారు
ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు స్పందించాలి
పరిష్కారం వచ్చే వరకు పోరాటం చేస్తాం
ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టివ్వాలి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత
వెలుగుమట్ల బాధితులకు పరామర్శ
కాకతీయ, ఖమ్మం బ్యూరో : వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇళ్లను కోల్పోయి రోడ్డున పడిన ఆడబిడ్డల కన్నీళ్లు ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు తగులుతాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. వెలుగుమట్ల బాధితులను పరామర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చివేయడం అమానుషమని కవిత మండిపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పరీక్షల గురించి ఆందోళన చెందుతున్న సమయంలో రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేశారని అన్నారు. ఈ ఘటన పేదలపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. బాధితుల ఆవేదనను కొన్ని రాజకీయ పార్టీలు ఎగ్జిబిషన్‌లా చూస్తూ వెళ్లిపోయాయని కవిత విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా రాజకీయ లాభాల కోసం మాత్రమే కొందరు నాయకులు అక్కడికి వచ్చారని అన్నారు. బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. తాను కేవలం పరామర్శించడానికి మాత్రమే రాలేదని, బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి సంస్థ కూడా బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు
బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు వెళ్లమంటే వెళ్లబోమని బాధితులు చెబుతున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్‌ను గౌరవించాలని అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితులను పరామర్శించలేదని ఆమె విమర్శించారు. జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటివరకు అక్కడికి రాకపోవడం దారుణమని అన్నారు. ముందుగా కలెక్టర్ అక్కడికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుస్తున్నాయని, కానీ పెద్దల అక్రమ భవనాలపై మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కవిత ఆరోపించారు. పేదల హక్కులను కాపాడేందుకే ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


