కాంగ్రెస్లోకి భారీగా చేరికలు..!
కొత్తూరు తండాలో 20 కుటుంబాలు పార్టీ తీర్థం
కాకతీయ, కారేపల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. సోమవారం సింగరేణి మండలం కొత్తూరు తండాకు చెందిన సుమారు 20 కుటుంబాలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం శుభపరిణామమన్నారు. పార్టీలో పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కార్యకర్తలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో ధరావత్ బిచ్చు, మడంపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు సుమన్ నాయక్, బానోతు లక్ష్మ, ధరావత్ హీరలాల్, అజ్మీర బాబూలాల్, అమర్ సింగ్, మోహన్, బుక్య రవి, రాజు, రవి, వెంకటేష్, రమేష్, బాబులాల్ తదితరులు ఉన్నారు.


