మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు
జగిత్యాల జిల్లాలో 590 మంది మహిళలకు మొదటి విడతలో లబ్ధి
మిగిలినవారికి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో అవకాశం
ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
కాకతీయ, జగిత్యాల : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి పట్టణంలోని షాదీ ఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో కుట్టు మిషన్ల కోసం 590 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారని మొదటి విడతలో వారికి మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిగిలిన వారికి కూడా 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా అందజేస్తామని పేర్కొన్నారు. మైనార్టీ రుణాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖలతో చర్చించి రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలి
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండ
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన 15 మంది కుటుంబాలకు రూ.75 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 250 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


