పండుగలకు నిధులు కేటాయించాలి
కాకతీయ, హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగే ముఖ్యమైన పండుగల సందర్భంగా అవసరమైన ఏర్పాట్ల కోసం నిధులు కేటాయించాలని టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని శివాలయాల్లో భక్తులకు అవసరమైన ఏర్పాట్ల కోసం మున్సిపాలిటీ ద్వారా నిధులు కేటాయించే ఆనవాయితీ ఉందని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా ఇటీవల జరిగిన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గతంలో మాదిరిగానే శివాలయాలకు అవసరమైన ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే రాబోయే శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలకు కూడా గతంలో ఇచ్చిన విధంగానే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు అవసరమైన ఏర్పాట్ల కోసం గతంలో చేసినట్లే నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు.


