బైకు కొనివ్వలేదని విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య
కాకతీయ, కరీంనగర్ రూరల్ : బైకు కొనివ్వలేదన్న మనస్థాపంతో ఐటీఐ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ రూరల్ మండలంలో విషాదం నింపింది. మండలంలోని గోపాలపూర్ గ్రామానికి చెందిన సాయిని తిరుపతి కుమారుడు రిత్విక్ (17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఇటీవల తనకు బైకు కొనివ్వాలని తండ్రిని కోరగా, ప్రస్తుతం అప్పులు ఎక్కువగా ఉన్నాయని, పంట అమ్మిన తర్వాత డబ్బులు వచ్చిన వెంటనే కొనిస్తానని తండ్రి చెప్పాడు. అయితే తన స్నేహితులందరికీ బైకులు ఉన్నాయని, తనకు లేదన్న బాధతో రిత్విక్ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నెల 6వ తేదీ రాత్రి ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు.మృతుని తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.
రిత్విక్ మృతి కుటుంబాన్ని విషాదంలో ముంచింది.కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గోపాలపూర్ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.


