గంగదేవిపల్లి అభివృద్ధి కర్త ఇకలేరు
గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి కన్నుమూత
మూడు పర్యాయాలు జాతీయ ఆదర్శ గ్రామం సర్పంచ్‌గా బాధ్యతలు
రెండు పర్యాయాలు ఊకల్ సొసైటీ చైర్మన్‌గా సేవలు
గ్రామాన్ని జాతీయస్థాయిలో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత
కాకతీయ, గీసుగొండ : జాతీయ ఆదర్శ గ్రామంగా పేరుగాంచిన గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉదయం స్వగృహంలో అస్వస్థతకు గురైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్తతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన రాజమౌళి గంగదేవిపల్లిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు. మద్యపాన నిషేధం, వంద శాతం అక్షరాస్యత, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో గ్రామాన్ని జాతీయ ఆదర్శ గ్రామంగా నిలిపిన ఘనత ఆయనదే. ఆయన నాయకత్వంలో గంగదేవిపల్లి పలు మార్లు ఉత్తమ గ్రామంగా గుర్తింపు పొందింది. రాజమౌళి మూడు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా పనిచేసి ప్రజలకు సేవలందించారు. అలాగే రెండు పర్యాయాలు ఊకల్ సహకార సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి రైతుల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన నాయకత్వాన్ని చూసి అనేక మంది ఐఏఎస్ అధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా ప్రశంసించారు. రాజకీయంగా కూడా చురుకుగా ఉన్న ఆయన శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఎంసిపిఐ పార్టీ వ్యవస్థాపకుడు ఓంకార్‌కు సన్నిహిత శిష్యుడిగా గుర్తింపు పొందారు.శాయంపేట నియోజకవర్గంలో ఎంసిపిఐ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


