హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి సస్పెన్షన్
దరఖాస్తులు పెండింగ్, విధుల్లో నిర్లక్ష్యంపై చర్య
కాకతీయ, హుజూరాబాద్: వరంగల్ ప్రాంత పరిధిలోని హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారిణి డి. చందనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల దరఖాస్తులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచడం, విధులకు తరచూ గైర్హాజరు కావడం వంటి ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై నిర్వహించిన విచారణ నివేదిక ఆధారంగా సంయుక్త కార్మిక కమిషనర్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆమెపై తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. కార్మికులకు సంబంధించిన దరఖాస్తులను ఆలస్యం చేయకుండా పౌర సేవల నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


