గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ టీకా
బాలికలు తప్పనిసరిగా తీసుకోవాలి
: కలెక్టర్ గరిమ అగ్రవాల్
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా కీలకమని, 14 నుంచి 15 సంవత్సరాల బాలికలు తప్పనిసరిగా ఈ టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 1, 2011 నుంచి మార్చి 31, 2012 మధ్య జన్మించిన 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలికలకు టీకాలు అందజేశారు. టీకా తీసుకున్న బాలికలకు కలెక్టర్ స్వయంగా వాక్సినేషన్ సర్టిఫికెట్లు అందించారు. జిల్లాలో మొత్తం 3,773 మంది బాలికలను గుర్తించామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల గుర్తింపు కార్డులతో వచ్చి టీకా వేయించేందుకు సహకరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ టీకా పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.


