యువకుడి హత్య కేసులో ముగ్గురి అరెస్టు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు బైరి శారద అలియాస్ కళ్యాణి, ఆమె భర్త బైరి శేఖర్, సహకరించిన గుండం రవి అలియాస్ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం వేములవాడ అంజనీనగర్‌కు చెందిన బైరి శారద స్థానికంగా నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు భూక్య మోహన్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా మోహన్ డబ్బులు కావాలని శారదను వేధిస్తూ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడని తెలిపారు. ఈ పరిస్థితిని భరించలేక శారద తన భర్త శేఖర్‌తో కలిసి మోహన్‌ను హత్య చేయాలని పథకం వేసింది. ఈ కుట్రలో గుండం రవిని కూడా సహాయానికి తీసుకున్నారు. ఈ నెల 4న శారద మోహన్‌ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్‌లో ఉన్న లాడ్జ్‌కు పిలిపించింది. అక్కడికి వచ్చిన శేఖర్, రవిలు కలిసి నైలాన్ తాడుతో గొంతు నులిమి మోహన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించి తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు, చాకును స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు.


