చీరెలో మెరిసిన నారీశక్తి
మహిళా దినోత్సవానికి చేనేత దంపతుల ప్రత్యేక సృష్టి
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకు చెందిన చేనేత దంపతులు నేసిన ప్రత్యేక పట్టుచీర అందరి ప్రశంసలు అందుకుంటోంది. నారీశక్తి, మహిళల విజయాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేనేత కళాకారులు హరిప్రసాద్, రేఖా దంపతులు మూడు నెలలపాటు శ్రమించి ఈ చీరను మగ్గంపై నేసారు. సంప్రదాయ చేనేత కళకు ఆధునిక ఆలోచనలను జోడిస్తూ మహిళల శక్తి, సహనం, సాధనలను ప్రతిబింబించేలా ప్రత్యేక నమూనాలు, ఆకృతులు, ఆకర్షణీయ రంగులతో చీరను రూపొందించారు. మన దేశానికి గౌరవం తీసుకొచ్చిన మహిళల విజయాలను ఒకే చీరపై ప్రతిబింబించేలా ఈ ప్రత్యేక చీరను రూపొందించినట్లు హరిప్రసాద్ తెలిపారు. మహిళల విజయాలను సూచించేలా పలు క్రీడా విజయాలు, మహిళా సాధికారతను సూచించే ప్రతీకలు చీరపై అద్భుతంగా నేసారు. ప్రముఖ ఆర్చర్ సీతల్ దేవి, క్రీడాకారిణి జ్యోతి చిత్రాలను కూడా చీరపై ప్రతిబింబించారు. మహిళల విజయాలను ప్రజలకు గుర్తు చేయాలనే ఉద్దేశంతో తాను, తన భార్య కలిసి ఈ చీరను రూపొందించామని హరిప్రసాద్ తెలిపారు. మహిళా దినోత్సవానికి అంకితంగా నేసిన ఈ ప్రత్యేక చీర స్థానిక ప్రజలు, కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నారీశక్తి గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ చీరకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.



