జాతరలో తప్పిపోయిన చిన్నారి..
తల్లికి అప్పగించిన పోలీసులు
కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో తప్పి పోయిన ఓ చిన్నారిని పోలీసులు గుర్తించి సురక్షితంగా తల్లికి అప్పగించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన శిరీష తన మూడు సంవత్సరాల కుమార్తె రియాన్స్‌తో కలిసి కొమ్మాల జాతరకు వచ్చింది. జాతరలో భక్తులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో కొంతసేపటికి చిన్నారి తల్లి వద్ద నుంచి తప్పిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లి ఆందోళనకు గురై జాతర బందోబస్తులో ఉన్న పోలీసులను ఆశ్రయించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జాతర ప్రాంగణంలో గాలింపు చేపట్టి కొంతసేపటికే చిన్నారి రియాన్స్‌ను గుర్తించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తీసుకువచ్చారు. అనంతరం చిన్నారి తల్లి నన్నబోయిన శిరీషను కంట్రోల్ రూమ్‌కు పిలిపించి ఆమెకు చిన్నారిని సురక్షితంగా అప్పగించారు. చిన్నారిని సకాలంలో గుర్తించి తల్లికి అప్పగించిన పోలీసులకు భక్తులు, స్థానికులు అభినందనలు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.


