ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
గ్రంథాలయ చైర్మన్‌పై మహిళా కౌన్సిలర్ల ఆగ్రహం
కాకతీయ,ములుగు ప్రతినిధి:ములుగు మున్సిపాలిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన గ్రంథాలయ చైర్మన్ తక్షణమే బేషరతుగా ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ టెండర్ల వ్యవహారంలో గ్రంథాలయ చైర్మన్ జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి నిధులు ప్రజలకు సంబంధించినవని, ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు వాటి వినియోగంపై అవగాహనతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో చేపట్టిన టెండర్ల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గౌరవ కలెక్టర్ మరియు మున్సిపాలిటీ కమిషనర్‌కు తమ విన్నపాన్ని తెలియజేసినట్లు చెప్పారు. అలాగే జనవరి 19, 2026న ములుగు మున్సిపాలిటీ జనరల్ బాడీ పూర్తిగా ఏర్పడకముందే హడావుడిగా టెండర్లు పిలిచినట్లు వారు ఆరోపించారు. ఆ టెండర్లకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఫిబ్రవరి 26, 27 తేదీలలో మళ్లీ టెండర్లను రీకాల్ చేసినప్పటికీ పనుల పూర్తి వివరాలు, బడ్జెట్ వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు.
టెండర్లను అవసరమైతే రద్దు చేసి బడ్జెట్‌పై పునఃసమీక్ష చేసి తిరిగి పిలిచే అధికారం సంబంధిత శాఖకు ఉంటుందని, అదే విధంగా ప్రజలచే ఎన్నుకోబడిన కౌన్సిలర్లు కూడా ఆ పనులపై సమీక్ష చేయడం సహజమని వారు తెలిపారు. ఈ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడి మహిళా కౌన్సిలర్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హెచ్చరించారు. ఇకపై మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మున్సిపాలిటీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ కోయిల లక్ష్మి, 7వ వార్డు కౌన్సిలర్ బైకాని సునీత ఓదెలు, 15వ వార్డు కౌన్సిలర్ రెసోజు పద్మ వేణుగోపాలచారి, 17వ వార్డు కౌన్సిలర్ గోనెల భరత్ కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూష సాగర్ పాల్గొన్నారు.


