హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..
ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులు..
ఆటోను తప్పించబోయి ప్రమాదం..
టిప్పర్ లారీ కింద ఇద్దరు విద్యార్థులు మృతి..
కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. అనంత సాగర్‌లోని ఎస్సార్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న జు నైత్, సుప్రతీక అనే విద్యార్థులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించేందుకు ప్రయత్నించగా వారు అదుపుతప్పి కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ లారీ వారిపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి మృతదేహాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఎస్సార్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


