వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం
కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వంద రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 205 మంది ప్రజలకు వైద్య సేవలు అందించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెంకటాపూర్ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్. శ్రీకాంత్ తెలిపారు. శిబిరంలో వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. స్త్రీల సంబంధిత సమస్యలతో వచ్చిన 67 మందికి, ఎముకల సమస్యలతో వచ్చిన 16 మందికి, కంటి సమస్యలతో 34 మందికి, దంత సమస్యలతో 13 మందికి, ఇతర వైద్య సమస్యలతో 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. అలాగే వెంకటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జవహర్ నగర్ కేజీవీబీ హాస్టల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 290 మంది విద్యార్థులను పరీక్షించి, 134 మందికి చికిత్స అందించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యారాణి, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ అనూష, ఎముకల వైద్య నిపుణుడు డాక్టర్ రాజ్ కమల్, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజకుమార్, దంత వైద్య నిపుణుడు డాక్టర్ హరీష్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ రిషిత, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాడిశెట్టి శ్రీనివాస్, పీహెచ్ఎన్ఓ శోభా, హెల్త్ సూపర్వైజర్ పుష్ప కుమారి, నర్సింగ్ ఆఫీసర్ మునెమ్మ, ఆరోగ్య కార్యకర్తలు అనురాధ, స్వప్న, కనకలక్ష్మి, మోతిలాల్‌తోపాటు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


