కాకతీయ, నేషనల్ డెస్క్: గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. శనివారం, ఆదివారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, సెప్టెంబర్ 2 వరకు గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.గుజరాత్‌లోని ఖేడా, ఆనంద్, పంచ్‌మహల్, దహోద్, వడోదర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం నాటి అంచనా ప్రకారం, మహిసాగర్, చోటా ఉదయపూర్, నర్మద, సూరత్, డాంగ్, తాపి, నవ్‌సరి, వల్సాద్, డామన్, దాద్రా నాగర్ హవేలిలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీనితో పాటు, రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
బనస్కాంత, పటాన్, మెహసానా, సబర్‌కాంత, గాంధీనగర్, ఆరావళి, అహ్మదాబాద్, మహిసాగర్, ఛోటా ఉదయ్‌పూర్, నర్మదా, భరూచ్, సూరత్, డాంగ్, తాపి, నవ్‌సారి, వల్సాద్, కచ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సురేంద్రనగర్, రాజ్‌కోట్, జునాగఢ్, అమ్రేలి, భావ్‌నగర్, గిర్ సోమనాథ్, బొటాడ్, డయ్యూలో భారీ వర్షాలు కురుస్తాయని.. దీంతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది
గత 24 గంటల్లో పంచమహల్, తాపి, సబర్కాంత జిల్లాల్లోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అనేక నివాస ప్రాంతాలు జలమయం అయ్యాయి. సబర్కాంతలోని హిమ్మత్‌నగర్‌లో వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వర్షపు నీరు నివాస ప్రాంతాలలోకి ప్రవేశించింది. మునిసిపాలిటీకి మెమోరాండం ఇచ్చినప్పటికీ, మునిసిపాలిటీ వర్షపు నీటిని తీసివేయడంలో విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా న్యూ బల్వంత్‌పురా ప్రాంతంలో, వర్షపు నీరు ప్రవేశించడంతో పరిస్థితి అదుపు తప్పింది. శనివారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా, న్యూ బల్వంత్‌పురా అండర్‌బ్రిడ్జ్, రోడ్డు ఒకే స్థాయిలోకి వచ్చాయి. న్యూ బల్వంత్‌పురా కర్ణావతి లక్ష్మీ పార్క్ సొసైటీల ప్రధాన రహదారులు చెరవులను తలపిస్తున్నాయి.


