రోడ్డు ఆక్రమణ ఆరోపణలు అసత్యం
చట్టబద్ధ స్థలంలోనే నిర్మాణం
డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ భగత్‌నగర్‌లో రోడ్డును ఆక్రమించి కార్యాలయం నిర్మించారని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కొన్ని పత్రికల్లో వార్తలు ప్రచురితమైనట్లు తెలిపారు. అయితే అవి వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గతంలో కరీంనగర్ నగరంలో గాని, ఇతర ప్రాంతాల్లో గాని తాము ఎలాంటి అక్రమ నిర్మాణాలు లేదా కబ్జాలకు పాల్పడిన చరిత్ర లేదన్నారు. తాము చేసే ప్రతి పని చట్టపరమైన విధానంలోనే జరుగుతుందని తెలిపారు. అందువల్లే నగర ప్రజల్లో తమకు ఆదరణ లభిస్తోందని చెప్పారు. భగత్‌నగర్‌లో ఉన్న ఆ స్థలాన్ని 1997లో కరీంనగర్‌కు చెందిన న్యాయవాది ఎడవల్లి జగ్గారెడ్డి జిడిగ భూమయ్యకు విక్రయించగా, 2004లో భూమయ్య వద్ద నుంచి చట్టపరంగా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆ సమయంలోనే 15 అడుగుల రహదారి కోసం స్థలం విడిచిపెట్టి మిగిలిన భాగాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ 15 అడుగుల రహదారి యథావిధిగా ఉందన్నారు. తాము చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలంలోనే 2014లో కార్యాలయ నిర్మాణం చేపట్టామని, అప్పటి నుంచి మున్సిపల్ పన్నులు చెల్లిస్తూ చట్టబద్ధంగా ఉపయోగిస్తున్నామని చెప్పారు. రహదారిని ఆక్రమించి నిర్మాణం చేశారన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు చేసిన వారు వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


