కొమ్మలగుట్ట వెనుక మంటలు
కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతర మూడో రోజు జరుగుతున్న సమయంలో కొమ్మలగుట్ట వెనుకవైపున గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. గుట్ట ప్రాంతంలో పొదలు, పొడి గడ్డి, ఎండుటాకులు ఎక్కువగా ఉండటంతో మంటలు కొంతసేపు వ్యాపించాయి. ఈ ఘటనను గమనించిన ఒక స్థానిక భక్తుడు వెంటనే గీసుగొండ సీఐ విశ్వేశ్వర్‌కు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న సీఐ సూచనల మేరకు ఎస్సై కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుంది. పోలీసులు, స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలాన్ని స్థానిక తహసీల్దార్ ఎండి రియాజుద్దీన్, ఉత్సవ కమిటీ చైర్మన్ విరాటి రవీందర్ రెడ్డి పరిశీలించారు.




