మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
కాకతీయ, చింతకాని: మండలంలోని నాగులవంచ రైతు వేదికలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల సమావేశం జరిగింది. ఐక్య రైతు సంఘం నాయకుడు కోలేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం మండల మొక్కజొన్న సాగు రైతుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా కూచిపూడి విజయ్‌కుమార్, కార్యదర్శిగా నారపోగు నాగయ్యను ఎన్నుకున్నారు. సదస్సులో రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న ధరలు ప్రస్తుతం క్వింటాకు 1500 నుంచి 1600 రూపాయల మధ్య ఉన్నాయని, ఈ ధరకు అమ్మితే రైతులకు గిట్టుబాటు కాదని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకు మార్చి 15 లోపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొనుగోలు సమయంలో తారం పేరుతో క్వింటాకు మూడు కిలోలు తగ్గించడం వంటి దోపిడీని అరికట్టాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సొసైటీ సీఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని రైతులు హెచ్చరించారు.


