ప్రణాళిక ప్రకారం
డ్రైన్ల క్లీనింగ్ చేపట్టాలి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్
నగరంలోని పలు డివిజన్లలో పర్యటన
శానిటేషన్, అభివృద్ధి పనుల తనిఖీలు
కాకతీయ, వరంగల్ : అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్/ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గురువారం హన్మకొండ పరిధిలో శానిటేషన్ తనిఖీలతో పాటు పూర్తి చేసిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యక్షంగా కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్ లోని బొక్కల గడ్డలో రోడ్లు, డ్రైన్ పనులను, 4వ డివిజన్ లో జ్యోతిరావు పూలే నగర్ లో రోడ్లు, డ్రైన్ పనులను, 29వ డివిజన్ లోని రామన్న పేటలో రోడ్డు నిర్మాణ పనులు, 30వ డివిజన్ లోని జూపార్క్ లో నిర్మాణం కొనసాగుతున్న స్ట్రాం వాటర్ డ్రైన్ పనులతో పాటు పద్మాక్షి రోడ్ లో ఆర్ 1కు చెందిన రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించారు. ఈ క్రమంలో చెత్త కుప్పలు ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఏ సమయంలో చెత్త కుప్పలను తీస్తున్నారని అడిగి తెలుసుకొని ఎప్పటికపుడు తొలగించాలన్నారు. స్వచ్ఛ ఆటోలు ప్రతి గృహం నుండి తడి పొడి చెత్తను వేరుగా సేకరించాలని, నిర్దేశిత ప్రణాళిక ప్రకారం డ్రైన్ ల క్లీనింగ్ జరగాలని అధికారులకు సూచించారు.కార్యక్రమంలో ఎంహెచ్ఓ డా రాజేష్, ఈఈ రవి కుమార్, డిఈలు రాజ్ కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్ వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


