గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల జైలు
రెండు లక్షల జరిమానా విధించిన కోర్టు
కాకతీయ, రఘునాథపాలెం: గంజాయి అక్రమ రవాణా కేసులో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఉమాదేవి తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021 ఏప్రిల్ 7న రఘునాథపాలెం పోలీసులు వెంకటాపాలెం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేయగా సుమారు 30 లక్షల విలువైన 194 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ లాభాల కోసం గంజాయిని డొంకరాయ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో బోడ వాల, కొండపల్లి రవితేజ, బొజ్జ వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నిందితులపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. ఈ కేసు విచారణలో సహకరించిన అప్పటి విచారణ అధికారి సత్యనారాయణ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది శరత్ కుమార్ రెడ్డి, కోర్టు సిబ్బందిని పోలీసులు అభినందించారు.


