పదేళ్ల సమస్యకు కదలిక..!
అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపునకు చర్యలు
టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక కంటైనర్ ఏర్పాటు
మంచినీటి కోసం బోర్.. వేచిచూడటానికి షెడ్లు..
విద్యుత్ లైన్ లేక తరలింపులో ఆలస్యం
శాశ్వత భవనానికి రూ.8.50 కోట్ల ప్రతిపాదనలు
‘కాకతీయ’ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తక్షణం తరలింపునకు అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయ సమస్యకు పరిష్కారం దిశగా కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌లోని సొంత స్థలానికి తరలించేందుకు రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇరుకైన గదులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సిబ్బంది, వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను “దూరం… భారం..” అనే కథనం కాకతీయ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన విషయం పాఠకులకు విదితమే. అధికారులు స్పందించి కార్యాలయ తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లు
ఆర్టీఏ కార్యాలయాన్ని టెక్స్టైల్ పార్క్‌కు తరలించే ప్రక్రియలో భాగంగా ఆ శాఖకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అధికారులు తాత్కాలికంగా ఒక కంటైనర్ ఏర్పాటు చేశారు. కార్యాలయ అవసరాల కోసం మంచినీటి సౌకర్యం కల్పించేందుకు బోర్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాహన వినియోగదారులు వేచి ఉండేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే అక్కడ ఇప్పటివరకు విద్యుత్ సరఫరా లేకపోవడం కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో తరలించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి విద్యుత్ లైన్ ఏర్పాటు చేసే ప్రక్రియను అధికారులు ప్రారంభించినట్లు సమాచారం. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన వెంటనే కార్యాలయాన్ని పూర్తిగా టెక్స్టైల్ పార్క్‌కు తరలించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

శాశ్వత భవనానికి ప్రతిపాదనలు
ఆర్టీవో కార్యాలయానికి శాశ్వత సొంత భవనం నిర్మాణం కోసం సుమారు రూ.8.50 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు. రవాణా శాఖకు ఇప్పటికే సొంత స్థలం ఉన్నప్పటికీ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు అందకపోవడంతో ఇప్పటివరకు కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. రాబోయే బడ్జెట్‌లో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. రవాణా శాఖకు చెందిన సొంత భవనాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులతో చెప్పడం గమనార్హం. ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లతో సేవలను ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి తీసుకువచ్చి, అనంతరం పూర్తి స్థాయి సొంత భవన నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలు త్వరగా కల్పిస్తే ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. రవాణా శాఖలో చేపడుతున్న ఈ చర్యలు జిల్లా ప్రజలకు మెరుగైన సేవలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



